Friday, March 20, 2015

ఇది కథ కాదు, కల్పితం

ఇది కథ కాదు, కల్పితం అంతకన్నా కాదు. ఊహించింది అసలే కాదు. ఒక అతివ నిజజీవితం.. ఒక వాస్తవం.. జీవితంలో పెళ్లి కీలక మజిలీ. ఆ తరువాత సాగాల్సినవన్నీ హాయైన ప్రయాణాలే. కానీ, ఆ పెళ్లే, కొందరి జీవితాలను కీలక మలుపు తిప్పుతోంది.. తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తోంది... http://www.10tv.in/

       శాంతి మామూలు సగటు ఇల్లాలు.. ఇతరుల్లాగే తాను కూడా తన కుటుంబజీవితాన్ని గడుపుదామనుకుంది.. తనకు పెళ్లి నాటికి 23 ఏళ్లు. ఆమె భర్త శరత్ చదువుకున్నవాడు.. ఉద్యోగం చేస్తున్నాడు. మంచిచెడులు తెలుస్తాయిలే అనుకుంది. పెళ్లి తర్వాత తన భర్తే తనకు అన్ని విషయాల్లో తోడు-నీడ అనుకుంది. కానీ, శరత్ ఏ రోజూ తనకు తోడుగా ఉండలేకపోయాడు. నీడగా మారలేకపోయాడు. అతని తోడూనీడ మద్యమే. పగలైనా, రాత్రైనా ఇంట్లోనైనా, బైటైనా అతనికి కావాల్సింది తాగడమే. తాగడం శరత్ కు పెళ్లికి ముందు నుండే ఉన్న వ్యసనం. ఆ విషయం చెప్పకుండా పెళ్లి చేసారు. పెళ్లి చేస్తేనైనా ఆ మనిషిలో మార్పొస్తుందనుకున్నారు. కానీ, అతనిలో ఏ మార్పు లేదని, ఏ మార్పు రాదని కొంతకాలానికే అర్థమయిపోయింది. పెళ్లయిన రోజు నుండీ నేటివరకూ ఏనాడు శరత్ శాంతిని ప్రేమతో పలకరించిన పాపాన పోలేదు. సాయంత్రానికల్లా ఆఫీస్ నుండి వస్తాడని, ఎన్నో సార్లు ఎదురుచూస్తూ గడపమీదే నిద్రపోయింది. సంవత్సరంలో ఒకటి రెండు సార్లు తప్పితే కలిసి భోజనం చేసే స్థితి కూడా లేదు.

          ఏ రాత్రికో ఇంటికి చేరడం, ఇంటికొచ్చాక కూడా ఇంట్లో తనకోసం ఎదురుచూసే ఒక మనిషి ఉందనే ధ్యాస కూడా లేకపోవడం, పొద్దునే లేచి మనుషులెవరూ పట్టనట్ల వెళ్లిపోవడం, ఒకవేళ ఇంట్లో ఉండాల్సి వస్తే అకారణంగా చిరాకు పడటం, ఏదో ఒక కారణంతో చేయి చేసుకోవడం, ఒక మంచి మాటా లేదు. ప్రేమతో కూడిన పలకరింపూ ఉండదు. ఇలాంటి మనిషికి తనతో ఎందుకు పెళ్లి చేసారు? అతని దృష్టిలో అర్థాంగి అంటే ఓ పనిమనిషిని.. ఇంటిపనులు చక్కదిద్దే ఒక నౌకరు, భర్త ఏం చేసినా భరించే ఒక బానిస. అసలీ మనిషి నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు.. ఒక వంటమనిషిని, ఇద్దరు పని మనుషుల్ని పెట్టుకుంటే సరిపోయేది కదా అని శాంతికి అనిపించింది.
         శాంతి వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లల్ని కనడం, చూస్తుండగానే వారు పెరిగి పెద్దవారవ్వడం జరిగిపోయింది. పిల్లలు పుట్టాకైనా అతని ప్రవర్తనలో మార్పు వస్తుందనుకున్న తన ఆలోచనకి అర్థం లేదని తెలుసుకోవడానికి శాంతికి ఎంతో కాలం పట్టలేదు.. భార్యగా తన ముద్దు ముచ్చటా ఎలాగూ తీర్చలేదు. తండ్రిగా పిల్లల చిన్న చిన్న కోరికలు తీర్చలేని రాతి మనిషిగా మిగిలాడు.
        పిల్లలు ఎన్ని సార్లు తమ నాన్న కోసం ఎదురుచూసారో, ఎన్నిసార్లు నాన్న ఒడిలో నిద్దపోవాలని ఆశపడ్డారో, ఎన్ని సార్లు నాన్న భుజాల మీద ఆడుకోవాలని కలలు కన్నారో. పీకల దాకా తాగడం, అలసిపోయే దాకా పీడించుకుతినడం తప్పితే, ఆ మనిషికి ఇంకేం తెలుసు? ఏనాడైనా పిల్లల అచ్చటా ముచ్చటా చూసాడా? పిల్లల మంచి చెడుల విషయంలో బాధ్యత వహించాడా? బాధ్యత ఎప్పుడూ తనదే? అతను ఏ బాధ్యతా తీసుకోలేదు.
         ప్రేమగా తన చేయి పట్టుకుని తన గుండెల మీద పెట్టుకుని తనతో మాట్లాడితే బాగుండని ఎన్ని వందల వేల సార్లు అనుకుందో. తనతో ఏదైనా మాట్లాడమని, పనిలో మీరు మునిగిపోకండని అడిగి ఎన్నిసార్లు భంగపడ్డానో, తన మనసుకి తెలుసు. అలా అడిగిన ప్రతిసారి తననుండి ఒకటే సమాధానం, మనిద్దరం ప్రేమికులమా? కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి. ఆరోజు నుండి ఈ రోజు వరకు తనను ఒకటే ప్రశ్న తొలిచేస్తుంది. ప్రేమికులంటే ఎవరు? ప్రేమికులు పెళ్లి చేసుకోరా? పెళ్లి తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ ఉండదా? పెద్దలు కుదిర్చిన పెళ్లయినా, ఆ తరువాత ప్రేమించుకోకూడదా? తనకు తెలిసీ ప్రేమంటే ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోవడం, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం..
          శరత్ తనను ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని, తన ప్రవర్తన మార్చుకుంటాడని అని ఆశపడుతూ వచ్చింది. కాలం భారంగా గడుస్తోంది. శరత్ లో మరిన్ని ప్రతికూల మార్పులు, తాగడం వ్యసనంగా మార్చుకున్నాడు. ఆఖరికి ఇంట్లో పిల్లల ముందే తాగడం, వద్దని వారిస్తే నోటి కొచ్చినట్టూ తిట్టి చేయిచేసుకోవడం.. దీంతో పిల్లల ముందు శాంతి సిగ్గుతో చచ్చిపోయేది. శరత్ లో ఎప్పటికైనా మార్పొస్తుందని, తన తప్పు తెలుసుకుంటాడని, తనతో స్నేహంగా ఉంటాడని, జీవిత భాగస్వామిగా తనకు తోడుంటాడని, తండ్రిగా పిల్లల బాధ్యతలు తీసుకుంటాడని పదేపదే ఆశపడేది. కానీ, తన ఆశ అడియాసేనని పదే పదే రుజువయింది. ఎన్నేళ్లయినా శరత్ లో మార్పు లేదు. మార్పు రాదు.. ఇలాంటి మనిషి తనకు భర్తగా ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? అనే భావం ఆమెలో మెల్లగా ప్రవేశించింది.
            తన ఊహకు భిన్నంగా పిల్లలు స్పందించారు. కళ్లనీళ్లు పెట్టుకున్నారు. విడిపోవద్దని, విడాకులు తీసుకోవద్దని వారించారు. మా స్నేహితులు మమల్ని చులకనగా చూస్తారమ్మా, ప్లీజమ్మా, మా చదువులు డిస్ట్రబ్ అవుతాయి. మా కెరీర్ పాడవుతుంది. . మా చదువులు పూర్తయ్యాక మేము ఉద్యోగాల్లో స్థిరపడ్డాక. నాన్నకి దూరంగా ముగ్గురం ఒక దగ్గర ఉందాం.. అప్పుడు నాన్న నుండి నువ్వు విడాకులు తీసుకో అంటూ ధైర్యం చెప్పిన తన పిల్లలిద్దరూ.. తన కళ్ల నీళ్లు తుడిచారు.. తన ఒళ్లో పడుకుని తన్ను ఓదార్చారు. మీ కొసం మీరు చెప్పినట్లే చేస్తాకన్నా, అన్న తన మాటతో వాళ్లిద్దరూ తేరుకుని వాళ్ల వాళ్ల చదువుల్లో మునిగారు.. మళ్లీ పిల్లలిద్దరి బాధ్యత తనదే.. క్షణమో యుగంగా గడుస్తున్న తనకు పిల్లల చదువులు ఎప్పుడూ పూర్తవుతాయా? వారు ఉద్యోగాల్లో ఎప్పుడు స్థిరపడతారా అన్న ఆలోచనతో సరిపోతోంది.. కాలమే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుందంటారు.. ఆ సమాధానం ఎలా ఉంటుంది? కాలం చెప్పే సమాధానంతో మనం తృఫ్తి పడతామా? తన ఎదురుచూపులతో పాటే పిల్లల చదువులు పూర్తయి, మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కాలం ఎన్నో మార్పులు తెస్తుందంటారు. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుందంటారు. కానీ కదిలే ఆ కాలం తన విషయంలో మాత్రం ఎలాంటి మార్పు తేలేకపోయింది. తాగడం, అకారణంగా తనను కొట్టడం, బాధ్యతారాహిత్యంగా బతకడం, ఈ విషయంలో మాత్రం శరత్ లో ఏ మార్పు చూపలేకపోయింది. ఈ బందీఖానా నుండి బైటికొచ్చి, ఈ నరకం నుండి తాను బయటపడతానని, తన బిడ్డలు తన భుజాల మీద చెయ్యేసి పదమ్మా, ఇక్కడి నుండి ఈ నరకం నుండి వెళ్లిపోదామని తనను వారితో తీసుకెళ్తారని ఎదురు చూస్తూ ఉంది. ఏరీ ఒక్క కొడుకూ రాడే, కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నావని కూడా అడగరే.. పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆర్థికంగా స్థిరపడ్డారు. అయినా తన గురించి ఆలోచించరే.. తన ఒళ్లో పడుకుని ఏడ్చి, అమ్మా మా కోసం నువ్విప్పుడే విడాకులు తీసుకోవద్దమ్మా, మేము స్థిరపడ్డాక మనం ముగ్గురం ఒకే దగ్గర వుందాం. అప్పుడు స్వేచ్చగా విడాకులు తీసుకుందువుకానీ, అని చెప్పిన మాటలు, తన మనసులో ఇంకా తడిగానే ఉన్నాయి.. 50 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ ఎవరికోసమో ఒకరికోసమో తాను బతికింది.. బాధ్యత.. బాధ్యత అంటూ తనకు తానే సంకెళ్లు వేసుకుంది.
           ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉన్న ఈ బంధాలను తెంచుకోవాలి. తాళి కట్టానన్న పేరుతో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన తన భర్త నుండి, తన బాధ్యత అతనిది కాదనీ వెళ్లిపోయినా తన పిల్లల నుండి ఇంతకాలం కేవలం వారందరి అవసరం కోసమే తానున్నానే ఈ కఠిన వాస్తవం నుండి దూరంగా వెళ్లిపోవాలి. భవిష్యత్ లో తన కోసం తాను బ్రతకాలి.. తన ఆలోచనలకి అనుగుణంగా బ్రతకాలి.. తన కోసం తను బ్రతకాలి.. అందుకే ఈ బంధాల నుండి ఈ బాధ్యతల నుండి బైటపడాలనుకుంది. భర్తనుండి విడాకులు తీసుకుంది. ఒంట్లో ఓపికుంది. ఏ పనైనా చేసుకు బ్రతుకుతాననే గుండె ధైర్యముంది.. తన సమస్యకి తానే న్యాయ నిర్ణయం చేసుకుంది. తన తీర్పుని సమాజం కూడా గౌరవిస్తుందనే అనుకుంటోంది.

1 comment:


  1. ఇది కథ ఐనా నిజమే ఐనా ఆమె తీసుకొన్న నిర్ణయమే.కాని చాలా ముందే తీసుకొని ఉండవలసింది.అంతేకాదు.మళ్ళీ ఆ భర్త వృద్ధాప్యంలో అవసరముండి రమ్మన్నా వెళ్ళకూడదు.

    ReplyDelete