Wednesday, January 22, 2014

నట సామ్రాట్‌ అస్తమయం

వెండితెరపై తన నటనతో దశాబ్దాలపాటు తెలుగువారిని అలరించిన 'నట సామ్రాట్‌'.. 'దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత' అక్కినేని నాగేశ్వరరావు పరమపదించారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆయన వూపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు 2.45 గంటల సమయంలో బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీకి తరలించి ఆక్సిజన్‌ పెట్టారు. తరువాత పదినిమిషాలకే ఆసుపత్రికి వచ్చిన డా.సోమరాజు వైద్యుల బృందంతో కలసి పరిశీలించారు. అప్పటికే శ్వాస ఆగిపోవటంతో ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులకు తెలిపారు. ఆ సమయంలో కుమార్తె నాగసుశీల, మనవడు సుశాంత్‌ పక్కనే ఉన్నారు. నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు అస్తమయం అక్కినేనికి పేగు క్యాన్సర్‌ వ్యాధి బయటపడడంతో కిమ్స్‌ ఆసుపత్రిలో ఇటీవల శస్త్ర చికిత్స చేసి ఆ భాగాన్ని తొలగించారు. తరువాత కీమోధెరపీతో వైద్యం అందిస్తున్నారు. అప్పటి నుంచి ఆయన చక్రాలకుర్చీలోనే తిరుగుతున్నారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. విషయం తెలియగానే ఆయన బంధువులు, అభిమానులు ఆస్పత్రికి చేరుకున్నారు. ''నా ఒంట్లోకి ఇటీవలే.. క్యాన్సర్‌ ప్రవేశించినట్లు వైద్యులు ప్రకటించారు. అయినా అశేష ప్రేక్షకుల ఆశీస్సులతో మరి కొన్నాళ్లు ఇలాగే జీవించగలనని ఆశిస్తున్నాను... '' ఆత్మవిశ్వాసంతో చెప్పిన అక్కినేని అంతలోనే తన జీవన ప్రస్థానాన్ని ముగించటం ఆయన అభిమానులను విషాదంలో ముంచేస్తోంది. ఆయన మృతికి వన్ ఇండియా తెలుగు నివాళలు అర్పిస్తోంది.

1 comment:

  1. కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు గారు నిజంగా ధన్యజీవి, అమరజీవి.

    ReplyDelete