ఎక్కువశాతం పిల్లలు 6నెలల వరకు తల్లిపాల మీదే ఆధారపడి ఉంటారు. వారి
పెరుగుదల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే 6నెలల తరువాత నుంచి తల్లిపాలు
మాత్రమే సరిపోవు వారి పోషణకు. 6నెలల నుంచి వారి పెరుగుదలకు కావలసిన
కాలరీలు, ప్రోటీన్ల ఆవశ్యకత పెరుగుతుంది. ఆ అవసరాలను తల్లిపాలు మాత్రమే
తీర్చడం కుదరదు. అందుచేత 6 నెలల తరువాత నుంచి పిల్లలకు తల్లిపాలతో పాటు,
పోతపాలు లేదా ఇతర ఆహార పదార్థాలను ద్రవరూపంలో గాని, గణరూపంలో అలవాటు చేసే
పద్ధతిని వీనింగ్ అని అంటారు.
పిల్లలను క్రమంగా తల్లిపాలతో పాటు ఇతర ఆహారానికి అలవాటు చేసే ఆహార
పదార్థాలను వీనింగ్ ఫుడ్స్ అని అంటారు. పాలలో విటమిన్ సి చాలా తక్కువగా
లభ్యం అవుతుంది. ఈ విటమిన్ సిని అందివ్వడానికి పిల్లలకు 6నెలల నుండి పండ్ల
రసాలను ఇవ్వాలి. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఏర్పడిన ఐరన్ నిల్వలు లివర్‌లో
ఉంటాయి. ఇవి పుట్టినప్పటి నుండి 4-6 నెలల వరకు సరిపోతాయి. తరువాత నుండి
ఐరన్ ఆహారం ద్వారా వారికి లభించాలి. పాలలో విటమిన్ డి కూడా తక్కువగా
లభిస్తుంది. పిల్లలు అనుకున్న రీతిలో ఆరోగ్యంగా, పెరగాలి అంటే సప్లిమెంటరీ
ఫీడింగ్ 6నెలల నుండి ఆరంభించాలి. లేకపోతే పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం
ఉంటుంది.
పసిపిల్లలకు ఫీడ్ చేయడానికి టాప్ టిప్స్
6-12 నెలల పిల్లలు ప్రతిరోజూ తీసుకోవలసిన ఆహారం
పప్పులు-15గ్రాములు, గోధుమలు 30-45గ్రాములు, పాలు 200-500మిల్లీ
గ్రాములు(తల్లిపాలు ఇస్తుంటే, 200మిల్లీ లీటర్ల పై పాలు సరిపోతాయి),
దుంపలు- 50గ్రాములు, ఆకుకూరలు-50గ్రాములు ఇతర కూర గాయలు 25గ్రాములు, పండ్లు
-100గ్రాములు, చక్కెర -25గ్రాములు, వెన్న-10గ్రాములు, 6-12నెలల పిల్లలు
8.6కేజీల వరకు బరువు ఉండాలి. వీనింగ్ ఫుడ్స్ లేదా సప్లిమెంటరీ ఫుడ్స్
3రకాలుగా చెప్పవచ్చు
లిక్విడ్ సప్లిమెంట్స్
ఈ ఆహారం 6నెలల నుండి స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా పాలు 6నెలల నుండి
తల్లిపాలు 3-4సార్లు మాత్రమే ఇస్తూ, ఆవుపాలు కాని, గేదెపాలు కాని అలవాటు
చేయాలి. ఈ పోతపాలలో పోషకాలు తల్లిపాలతో పోలిస్తే వేరుగా ఉండటం చేత, పిల్లలు
అలవాటుపడటానికి పాలలో కాచి చల్లార్చిన నీళ్ళను పంచదార కలిపి తాగించాలి.
పాలు, నీళ్ల శాతం 2ః1గా ఉండాలి. చక్కెరల వల్ల కాలరీలు పెరుగుతాయి.
తాజా పండ్ల రసాలు
ఆరంజ్, టమాటో, ద్రాక్ష, వంటి పండ్లు మంచి పోషకాలు కలిగి ఉంటాయి. వీటిలో
లభ్యమయ్యే పోషకాలు పాలలో దొరకవు. అందుచేత ఈ పండ్ల రసాలను పిల్లలకు కాచి
చల్లార్చిన నీళ్లు కలిపి స్టార్ట్ చేయొచ్చు. నీరు, జ్యూస్ శాతం 1:1గా
ఉండాలి. జ్యూస్‌ను వడకట్టి తాగించాలి. క్రమంగా జ్యూస్ మోతాదు పెంచుతూ,
నీటిశాతం తగ్గించాలి.
కూరగాయలతో తయారుచేసిన సూపులు
పండ్లు దొరకని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఆకుకూరల రసాన్ని సూప్‌గా చేసి
ఇవ్వాలి. దీనిని వడకట్టి తాగించాలి. తరువాత మెల్లగా వడకట్టకుండా అలవాటు
చేయాలి. వీటితో పాటు ఫిష్ లివర్ ఆయిల్ కొన్నిచుక్కలు నుండి అర
టేబుల్‌స్పూన్ కొన్ని పాలలో కలిపి ఇవ్వటం వల్ల విటమిన్ ఎ, విటమిన్ డి
లభ్యమవుతుంది. పిల్లలకు పట్టేముందు జ్యూస్‌లను బాగా కలపాలి. జ్యూస్,
సూపులు నుండి మెత్తని ఆహారాన్ని 7లేదా 8వ నెలలో ఆరంభించవచ్చు.
పెరుగుతున్న కాలరీస్, ప్రొటీన్ల ఆవశ్యకత వల్ల వాటిని సరైన రీతిలో
అందించడానికి, బాగా ఉడికించి, మెత్తగా చేసిన తృణధాన్యాలను పాలు, చక్కెర
కలిపి పెట్టాలి. క్యాలరీస్ ఎక్కువగా లభ్యమయ్యే మాల్టెడ్ వీట్, రాగిని ఈ
ఆహారంలో చేర్చాలి. మాల్టెడ్ తృణధాన్యాలు అంటే వాటిని రాత్రంతా నానబెట్టి,
ఒక బట్టలో మూటకట్టి, మొలకలు వచ్చిన తరువాత ఎండలో ఎండబెట్టి, ఎర్రగా
వేయించుకోవాలి. తరువాత మొలకలను తీసేసి పౌడర్ చేసుకోవాలి. ఎక్కువగా
ఆలుగడ్డ, ఆకుకూరలు, కేరట్స్‌ను ఇవ్వవచ్చు. ఈ కూరగాయల వల్ల విటమిన్స్,
ఖనిజాలు లభ్యమవుతాయి. అలాగే ఈ ఆహారపదార్థాల వల్ల పిల్లలు కలర్‌ఫుడ్‌కి
అలవాటు పడతారు.
పండ్లు
అన్ని రకాల పండ్లు ఉడకబెట్టి, వడకట్టి తినిపించాలి. అవసరం అనిపిస్తే కొంచెం
షుగర్ కలుపుకోవచ్చు. అరటిపండును మాత్రం ఉడికించవలసిన అవసరం లేదు. మెత్తగా
చేసి తినిపించవచ్చు
గుడ్డు
ఉడికించిన గుడ్డు పచ్చసొన కొంచెం తినిపించాలి. దానివల్ల ఎలాంటి అలర్జీ
ఉండదు. పిల్లలు తినగలుగు తున్నారు అని నిర్ధారించుకున్న తర్వాత క్రమంగా
మోతాదు పెంచుతూ మొత్తం పచ్చసొన తినిపించవచ్చు. గుడ్డులోని యోక్‌లో
విటమిన్, ఐరన్, ప్రోటీన్లు ఎక్కువగా లభ్యమవు తాయి. గుడ్డు తెల్లసొన
మాత్రం సంవత్సరం తర్వాతనే పెట్టాలి. ఎందుకంటే దీనివల్ల పిల్లలకు అలర్జీ
వచ్చే అవకాశం ఉంటుంది.
పప్పుధాన్యాలు
బాగా ఉడికించిన పప్పులు, తృణధాన్యాలతో కలిపి తినిపించవచ్చు. ఉదా: కిచిడి,
పొంగలు, పెసరపాయసం వంటివి. వీటిని పలుచగా కానీ లేదా కొద్దిగా సెమీ
సాలిడ్‌గా కానీ పెట్టవచ్చు. పప్పుధాన్యాలు ఇచ్చినరోజు గుడ్డు, మాంసం
ఇవ్వవలసిన అవసరం లేదు. అవి మరొక రోజు ఇస్తే పిల్లలకు కావలసిన శక్తి
లభిస్తుంది. పిల్లలు చేతితో తీసుకొని కొరికి తినే సమయం అంటే 10-12 నెలల
సమయంలో ఇలాంటి ఆహారం అందించాలి. బాగా ఉడికించిన తృణధాన్యాలు,
పప్పుధాన్యాలు, కూర గాయలు, మాంసం, పండ్లు (ఉడికించినవి కాని పచ్చివి కాని)
పెట్టాలి. ఇడ్లీ, ఇడియాప్పం, ఉప్మా, బ్రెడ్, చపాతి, అన్నం, పప్పు వంటివి
అలవాటు చేయాలి.
చిన్నగా కట్‌చేసిన పండ్లు, కూరగాయాలలో గింజలు ఉంటే అవి తీసేసినవి ఇవ్వాలి.
వీటివ్ల దవడలకు మంచి ఎక్సర్‌సైజ్ లభిస్తుంది. ఎందుకంటే పిల్లలు నమిలి
తింటారు. కాబట్టి ఎక్కువగా పండ్లు తీసుకోవటం వల్ల జీర్ణశక్తి కూడా
పెరుగుతుంది. పిల్లల ఆహార విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపించే తల్లి, ఎక్కువగా
ఇంట్లో చేసిన వీనింగ్ ఫుడ్స్‌నే ఇవ్వాలి. వీటిని తృణధాన్యాలు,
పప్పుధాన్యాలు, పంచదార, బెల్లం, పాలతో ఇంట్లోనే తయారుచేసుకోవాలి. వీటివల్ల
కేలరీలు, ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఖనిజాలు తగు మోతాదులో
అందించవచ్చు. మంచి పరిశుభ్రమైన ఆహారం కూడా అవుతుంది.
వీటితో ఆకుకూరలను కూడా ఉపయోగించాలి. ఒక్కోసారి ఒకరకమైన ఆహారాన్ని ఇవ్వాలి.
ఒక ఆహార పదార్థానికి అలవాటుపడ్డ తర్వాత ఇంకో రకం ఆహారం ఇవ్వాలి. ఏదైనా
కొత్త ఆహార పదార్థం అలవాటు చేస్తున్నపుడు ముందుగా ఒక టేబుల్ స్పూన్ పట్టి
ఆగాలి. అది సరిపడితే కంటిన్యూ చేయాలి. లేకపోతే మానేయాలి.ద్రవపదార్థాలు
అలవాడు చేసేటప్పుడు అవి చాలా మెత్తగా ఉండేలా చూడాలి. పిల్లలు ఏదైన ఆహారం
తినడం ఇష్టపడకపోతే, కొన్నిరోజులు దాన్ని ఆపి మళ్లీ పెట్టాలి.

No comments:
Post a Comment