జీవితంలో
అమృతం నింపుతాడనుకున్న వ్యక్తి గరళం నింపాలని చూస్తే! మానప్రాణాలు
కాపాడతాడనుకున్న సహచరుడు ప్రాణాలు హరించాలని చూస్తే ! ఆజన్మాంతం తోడుగా
ఉంటాడనుకున్న నీడే పాముగా మారి జన్మను.............అంతంచేయాలనుకుంటే! పతిసేవే పరమార్థం అంటూ సర్దుకుపోవాలా? పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తూ బాధను దిగమింగాలా? లేక ఇదేం న్యాయమని ప్రశ్నించాలా? పూజ ఇప్పుడు న్యాయంకోసం పోరాడటానికే నిర్ణయించుకుంది.
పూజకు గిరితో వివాహమై 27యేళ్లు. గిరి డిఫెన్స్‌లో ఉద్యోగం చేస్తాడు. సంపాదన బాగానే వుంటుంది. ప్రవర్తనే లోపభూయిష్టంగా ఉంటుంది. అందరు మన దేశంలో ఇల్లాళ్లంతా స్మరించే తారకమంత్రం 'సర్దుకుపోవడం'. అదే పూజ కూడా నమ్మింది. రోజుకు వందసార్లు అదే మంత్రాన్ని వల్లెవేసుకుంటూ రోజులు నడిపేస్తుంది. పెళ్లయి చాన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో వారు వైద్యులను సంప్రదించారు. లోపం గిరిలోనే ఉంది. విషయం తెలిసిన పూజ ఇద్దరం సరిగా ఉంటే చాలనుకుంది తప్ప బాధపడలేదు. అదే లోపం పూజలో ఉంటే అగ్నిపర్వతాలు బద్దలయ్యేవి. ఆగ్రహం లావాలా పెల్లుబికేది. ఆ విషయమూ పూజకు తెలుసు. అయినా, ఇవన్నీ పూజ మనసులో పెట్టుకోలేదు. ఎవరినైనా పెంచుకుందామని ప్రతిపాదించింది. ఏ కళనున్నాడో గిరి ఒప్పుకున్నాడు. ఒక పాపను పెంపకానికి తెచ్చుకున్నారు.
ఆ రోజునుండి పూజలోకం ఆ పాపే అయ్యింది. బాధలు, కష్టాల గురించి ఆలోచించడం మాని పాప భవిష్యత్తుకోసం కలలుకనేది. పాప అల్లరి, కబుర్లలో సర్వం మరిచిపోయేది. కానీ, గిరి ప్రవర్తనలో మరిన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. సూటిపోటి మాటలు, సాధింపులు, ఆరళ్లు... ఇలా పూజను నొప్పించడానికి మార్గాలెన్నో! అన్నింటినీ పూజ పంటి బిగువున భరించేది. తప్ప మారుమాట్లాడేది కాదు. చివరికి పూజ సహనానికి పరీక్షలా ఒక సంఘటన జరిగింది. ఒకరోజు గిరి ఇంట్లోకి దూసుకొచ్చాడు. ఆకారణంగా పూజను దూషించడం మొదలెట్టాడు. కారణం తెలియని పూజ నివ్వెరపోయింది. నేను చేసిన తప్పేంటని ప్రశ్నించింది. ఆ మాటకు గిరి నోటెంట బుల్లెట్లలాంటి మాటలు దూసుకొచ్చాయి. స్వయానా గిరి తమ్ముడితో పూజకు సంబంధం ఉందనేది ఆ మాటల సారాంశం. పూజ నోటివెంట మాటలు రాలేదు. గిరి ఏం మాట్లాడుతున్నాడో అర్థంకాక నిశ్చేష్టురాలైంది. తరువాత తేరుకుంది. ఇదేం అన్యాయమని ప్రశ్నించింది. మనసుకు తోచినట్లు ఆలోచించుకోవడం ఏంటి? అన్నెంపున్నెం యెరుగని తనను నిందించడమేంటని రోదించింది. గిరి ఇంట్లోంచి విసురుగా వెళ్లిపోయాడు తప్ప సమాధానం చెప్పలేదు.
విషయం అంతటితో ఆగలేదు. గిరి ఒళ్లుమరిచి ప్రవర్తించసాగాడు. ఇదంతా తనను వదిలి మరో పెళ్లి చేసుకోవడానికని పూజకు అర్థమైంది. ఓరోజు బలవంతంగా పూజచేత మత్తు బిళ్లలు మింగించాడు. అదృష్టవశాత్తూ పూజ ఆ ఆపదనుండి బయటపడింది. ఈలోగా పూజ తల్లిదండ్రులు గిరిపై కేసుపెట్టారు. పూజ తనంతట తానుగా మత్తుబిళ్లలు మింగలేదనీ, ఇదంతా గిరి పనేనని వారు ఆరోపించారు. కోలుకుంటున్న పూజ దగ్గరికి గిరి వచ్చాడు. ట్యాబ్లెట్లు తనంతట తానే మింగానని చెప్పమని బెదిరించాడు. నీ తల్లిదండ్రులతో కేసు వాపసు తీసుకునేలా చేయమన్నాడు. ఆపై నిన్ను ప్రేమగా చూసుకుంటానని మాటిచ్చాడు. పూజ అతను చెప్పినట్లే చేసింది. అనుకున్నట్లుగా పనైపోయాక గిరి మరో రూపం దాల్చాడు. పూజను హాస్పటల్‌నుండి తిన్నగా పుట్టింట్లో దింపాడు. దింపుతూ గిరి ఒకటే మాట చెప్పాడు. 'నువ్వు నాకొద్దు. నీ అవసరం నాకు లేదు' అని!
పూజ మనసు అలసిపోయింది. తానేం పాపం చేసిందని ఈ అన్యాయం! అతని చేష్టలను భరించడమేనా! ఎలా ఉన్నా సర్దుకుపోవడమేనా! పిల్లలు పుట్టకపోవడానికి లోపం అతనిలో ఉన్నా కిమ్మనకపోవడమేనా! అప్పుడే పూజ ఒకటి నిర్ణయించుకుంది. ఊరుకోవడం కాదు. న్యాయంకోసం పోరాడాలి అనుకుంది. వెంటనే వెళ్లి వుమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు ఫిర్యాదుచేసింది. అక్కడ పూజకు న్యాయం జరగలేదు. వాళ్లు లంచం తీసుకుని గిరికి అనుకూలంగా మాట్లాడారు. లంచాలు ఇవ్వడానికి పూజ దగ్గర డబ్బులేదు. అంతకుమించి ఆమె తప్పు చేయలేదు. ఆ సమయంలో పూజకు పుట్టిల్లు ఉన్న బస్తీవాళ్లు తోడుగా నిలిచారు. నీకు సరైన న్యాయం 'ఐద్వా లీగల్‌సెల్'లో దొరుకుతుందన్నారు.
పూజ బయలుదేరి 'ఐద్వా లీగల్‌సెల్'కు వచ్చింది. విషయమంతా చెప్పింది. సభ్యులు గిరిని పిలిపించారు. గట్టిగా మందలించారు. ఇప్పటికిప్పుడు కేసు పెట్టిందంటే పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోమన్నారు. పరువు పోవడం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఊడిపోతుంది. అప్పుడు రోడ్డుమీద పడాల్సిందే! అన్నింటినీ భూమాతలా భరిస్తున్నందుకు పూజను గుండెల్లో పొదువుకోవాల్సింది పోయి నేలరాయడం సబబుకాదని నచ్చచెప్పారు. ఇప్పుడు గిరిలో అనుకున్న మార్పొచ్చింది.
No comments:
Post a Comment