ఎల్లుండి పాటల టీవీనో, మాటల రేడియోనో కాసేపు చూడండి, వినండి. ఇవతలినుంచి ఏ ఏవీ రావో, వెంగల్రావో ఫోన్ లైన్లో ఉంటాడు......................................
''ఎలా ఎంజారు చేశారు, ఈరోజు?'' అని తొలి ప్రశ్న వినిపిస్తుంది.
''ఏమిచ్చారు?'', ''ఏం తీసుకున్నారు?''....గొప్ప తమాషాగా వినిపించే గొంతులోంచి ప్రశ్నలు దూసుకొస్తూనే ఉంటాయి. వాళ్లు ఊహించని జవాబు ఇటునుంచి వినిపించింది అనుకోండి. అవతలినుంచి భూమి బద్దలైపోయినంత ఆశ్చర్యం...!!
''అరె... ఎవరూ లేరా?'', ''అయ్యో... ఏమీ ఇవ్వలేదా?''
అసలు నువ్వు మనిషివేనా? అన్నట్టు ఉంటుంది ఆ గొంతులోని వ్యంగ్య వైభవం..!
ఇప్పుడు మనకు అనేక దినాలు దిగుమతి అయిపోయాయి. వాటి గురించి తెలీకపోయినా, తెలిసి పాటించకపోయినా మనం 'నాగరికత' తెలీని మనుషుల కిందే లెక్క! అమ్మకొకటి, నాన్నకొకటి, అమ్మానాన్నలు ఇద్దరికీ కలిపి మరొకటి, తాతలకు, బామ్మలకు చెరొకటి, కుటుంబం మొత్తానికి ఇంకొకటి ... ఇంకా స్నేహితులకు, పిల్లలకు, పెద్దలకు ... లెక్కలేనన్ని దినాలు ఉన్నాయి. టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, నర్సులు .... ఇంకా ఈ దినాల వరస చాలానే ఉంది. ఇక ఫిబ్రవరి 14న వచ్చే దినం అయితే- చాలా ప్రత్యేకం... అది ప్రేమికుల దినం. ఆరోజు చాలామంది కుర్రకారు హుషారుకు అడ్డూఅదుపూ ఉండదు. గ్రీటింగు షాపులూ, గిఫ్టుల దుకాణాలూ కిటకిటలాడిపోతాయి. పార్కులూ, హోటళ్లూ కళ'కలంతో కాంతులీనుతాయి. ఈ సందర్భంగా సాగే కోట్లాది రూపాయల వ్యాపార వ్యవహారమే ఈ ప్రత్యేక దినాల పరమావధి.
మనుషుల ఆలోచనలూ, అలవాట్లూ విభిన్నం, విస్తృతం. వాటన్నింటినీ ఒక వినిమయ ఛత్రం కిందికి క్రోడీకరించటం ఈ దిన సంస్క ృతి పరమార్థం. ఇష్టమైన రంగు, ఇష్టమైన సబ్బు, ఇష్టమైన డ్రింకు, ఇష్టమైన ప్రదేశం ... ఇలా మన ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండానే 'ఇష్టాల లిస్టు' తయారైపోతుంది. మనం తప్పించుకోవటానికి వీలు కానన్ని దినాలు మన చుట్టూ ఏర్పడి పోతాయి. బారుకొక గరల్ ఫ్రెండూ, గరల్‌కొక బారు ఫ్రెండూ ఉండడం ఆక్సిజన్ అంత అత్యవసరం అన్న భావన తలకెక్కిపోతుంది.. టీవీ, రేడియో, సినిమా వంటి సమస్త ప్రసార సాధనాలు 24 గంటలూ ఇదే ప్రబోధాన్ని నూరిపోస్తున్నాయి. తత్ఫలితంగా చూస్తుండగానే - రోజులు 'దినాలుగా', ప్రేమాభిమానాలు 'ఖరీదైన కానుకలుగా' మారిపోయాయి. సహజమైన మానవ సంబంధాలూ, ప్రేమాభిమానాలూ 'సరుకుల' రూపంలో వెల్లడించుకోవల్సిన దారుణ దుస్థితి దాపురించింది. ఈ వినిమయ విష సంస్క ృతి ఇప్పటికే మన ఇళ్లల్లోకి, మెదళ్లలోకి చొచ్చుకు వచ్చేసింది! అందుకనే- ఇప్పుడు విషమయ దినాలన్నిటికీ 'దినం' పెట్టే విధానం ఒకటి కావాలి. దినాల ధిక్కార స్వరం ప్రబలంగా వినిపించాలి.
No comments:
Post a Comment