యుగాల తరబడి సీత, అనసూయ, సావిత్రిల పేర్లుచెప్పి ఆడవారిని అంధకారంలో ముంచే సంప్రదాయం మనది. అవే పతివ్రతా లక్షణాలుగా చాటిచెప్పే సంస్కృతి మనది. వీటిని సాక్ష్యాలుగా చూపుతూ, అచ్చం అలాగే జీవించి 'ఆదర్శపత్నిగా' పేరు తెచ్చుకోమని............................శ్రావణి ఎమ్మెస్సీ చదువుకుంది. ఎప్పుడూ ఫస్టుమార్కులే వచ్చే శ్రావణిని ఆమె తల్లిదండ్రులు మరింతగా ఎదగమని ప్రోత్సహించేవారు. వారి అండదండలే ఆలంబనగా శ్రావణి మరింతగా ఎదిగింది. మంచి ఉద్యోగంలో స్థిరపడింది. బంధుమిత్రులు కూతురి పెళ్లెప్పుడని అడిగినా అమ్మాయి ఇష్టమని శ్రావణి తల్లిదండ్రులు చెప్పేవారు. పెళ్లి విషయం శ్రావణి ఇష్టానికే వదిలేశారు. అనుకోకుండా ఓ పెళ్లిలో శ్రావణిని చూసిన కరుణాకర్ ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వెంటనే తన తల్లిదండ్రులను రాయబారానికి పంపాడు. చదువు, అందం, ఉన్నతోద్యోగం ఉన్న కరుణాకర్‌ను కాదనడానికి శ్రావణివాళ్లకు కారణం కనిపించలేదు. పైగా 'సిరి తనంతట తానొస్తే కాలడ్డుపెట్టడం' అవివేకమని బంధుమిత్రుల సలహాలు వారిని నోరెత్తనీయలేదు. శ్రావణిసైతం కరుణాకర్‌ను ఇష్టపడింది. ఇక క్షణాల్లో పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి. శ్రావణి, కరుణాకర్‌ల వివాహం వైభోగంగా జరిగిపోయింది.
ఇది జరిగి పద్నాలుగేళ్లు. ఇప్పుడు వారికిద్దరు పిల్లలు. సంసారంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. నిత్యం ఇద్దరు పిల్లల కేరింతలతో ఆ కాపురం సందడిగా సాగిపోవాల్సిందే! అప్పుడే శ్రావణికి ఓ కఠోరసత్యం తెలిసింది. కానీ అది నిజమని నమ్మడానికి ఆమెకు మనసురాలేదు. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని భర్త ఇంత సులువుగా పక్కనపెడతాడని ఆమె కలలో కూడా అనుకోలేదు. పిల్లల మమకారాన్ని మరిచి, పరువు ప్రతిష్టలను కాలరాచి ఇంత హీనంగా దిగజారిపోతాడని ఆమె ఎన్నడూ తలంచలేదు. కరుణాకర్ ఉచ్ఛంనీచం మరిచి, వావి వరుసలు మరిచి తన వదినతోనే వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంతకాలమూ ఎవరికీ తెలియకుండానే గడుపుకొచ్చాడు. నిప్పును గుప్పిట్లో దాచాలనుకున్నాడు. కానీ నిజం బయటపడింది.
'పెళ్లి నమ్మకానికి కట్టుబడి ఉండే బంధం. మమతానురాగాలే పెట్టుబడిగా సాగే అనుబంధం. పిల్లలే వడ్డీగా కొనసాగే మురిపెం. ప్రేమే వారధిగా గల పొదరింటికి చెదలుపడితే సరిపెట్టుకోవాలా? అంతరాత్మను వంచించి అతనితో కాపురాన్ని కొనసాగించాలా? తను ఏ రకంగానూ కరుణాకర్‌కు లోటుచేయలేదు. ఆర్థికంగా తడబడ్డదీ లేదు. తన సంపాదనంతా ఇంటికే ఖర్చుచేస్తోంది తప్ప ఇతరత్రా వృథాచేసింది లేదు. అత్తవారింట్లో బాధ్యతలను ఏనాడూ మరిచింది లేదు. మరిక ఎందుకు తనను అవమానించినట్లు? ఎందుకు ఇలాంటి తప్పటడుగు వేసినట్లు? అతని చేతలను చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సిందేనా? తనకు ఆత్మాభిమానం లేదా? ఒంటరిగా బతికే ధైర్యం తనకు లేదా? తన పిల్లలతో హాయిగా బతకలేదా?'... ఇవే ప్రస్తుతం శ్రావణి ముందున్న ప్రశ్నలు. ఇవే అడిగినందుకు కరుణాకర్‌తో గొడవలు, దెబ్బలు. ఎదురుతిరిగి శ్రావణినే నానామాటలనడం. చివరకు శ్రావణి ఓ నిర్ణయానికి వచ్చింది. ఇదంతా తన కర్మ అనుకోకుండా తిన్నగా వెళ్లి భర్త వివాహేతర సంబంధం, అతని వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదుచేసింది. మరుక్షణంలో కరుణాకర్ జైల్లో ఉన్నాడు.
బెయిల్‌పై బయటికొచ్చిన కరుణాకర్ 'ఐద్వా లీగల్‌సెల్'కు వచ్చాడు. విషయమంతా దాచుకోకుండా చెప్పాడు. సభ్యులు కరుణాకర్‌ను తలవాచేలా చీవాట్లేశారు. చేసిన ఫలితం అనుభవించ తప్పదన్నారు. బుద్ధి గడ్డితిని ఇలాంటి వ్యవహారానికి పాల్పడ్డాననీ, ఇక ముందెన్నడూ ఇలాంటి చెత్త పనులు చేయననీ కరుణాకర్ నెత్తీనోరూ బాదుకున్నాడు. సభ్యులు శ్రావణిని, ఇరువైపులవారిని పిలిపించారు. స్వయానా తల్లిదండ్రులే అతన్ని అసహ్యించుకున్నారు. పిల్లలకు కారణం తెలియకున్నా అనుమానంగా దూరం జరిగారు. అందరి చీవాట్లు, సభ్యుల మాటలూ కరుణాకర్ తల దించుకుని విన్నాడు. అప్పటికే ఇంటాబయటా అందరూ కరుణాకర్‌ను చూసి ఉమ్మేస్తున్నారు. ఉద్యోగం పోయే పరిస్థితి కూడా వచ్చింది. అన్నిటికన్నా, ఎన్నడూ కోపమన్నది ఎరుగని శ్రావణి ఈ నమ్మకద్రోహాన్ని భరించలేక కాళిక అవతారమెత్తడం కరుణాకర్‌ను వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేసింది. దయచేసి ఈ కేసులు ఎత్తేయమని, సక్రమంగా కాపురంచేస్తానని శ్రావణిని ప్రాధేయపడ్డాడు.
శ్రావణి అతన్ని క్షమించింది. అతనేదో మారిపోతాడనే దానికన్నా, పిల్లలకు తండ్రిని దూరంచేయడం ఇష్టంలేక మనసును సర్దిచెప్పుకుంది. అయితే, కరుణాకర్‌లో నిజంగానే మార్పువచ్చింది. అది శ్రావణికి ఎంతో సంతృప్తినిచ్చింది.
No comments:
Post a Comment