భర్త కుటుంబాన్ని, అనుబంధాలను అవహేళన చేయడం పరిపాటిగా మారింది. నిజానికి ఈ వైపరీత్యం ఎక్కువగా పురుషుల్లోనే కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు చూస్తే, 'స్త్రీ భర్తనే జీవితం అనుకుంటుంది. కానీ, పురుషునికి భార్య జీవితంలో ఒక భాగం మాత్రమే'.........................
అని ఎక్కడో విన్నమాటలు నిజమేనేమో అనిపిస్తాయి. దాంపత్యం పదిలంగా కాపాడుకోవడంకోసం ఆడది మరే బంధాలనూ లెక్కచేయదు. కానీ, పురుషుడు అలా కాదు.బిందు మధ్యతరగతి అమ్మాయి. డిగ్రీ పూర్తిచేసింది. పెళ్లిచేయాలనే తల్లిదండ్రుల ఆకాంక్షకు మౌనంగానే అంగీకారం తెలిపింది. మనసులోనే రాబోయే వరుని ఊహాచిత్రాన్ని చిత్రించుకుంది. చివరికి బిందుకు తగిన వరుడు సాగర్ అని పెద్దలు నిర్ణయించారు. మంచి ఉద్యోగం, ఆర్థికంగానూ ఫర్వాలేదు. సాధారణంగా అమ్మాయిల్లో ముందు గమనించేది, అబ్బాయిల్లో ఆఖరుగా గమనిస్తారు... అదే అందం! ఆరకంగానూ సాగర్‌కు మంచి మార్కులే పడ్డాయి. సాగర్‌కు బిందు అన్నివిధాలా నచ్చడంతో వారి మధ్య బంధం ముడిపడింది.
ఇది జరిగి పదిహేనేళ్లు. వారికి ఇద్దరు పిల్లలు. చదువుకుంటున్నారు కూడా! ఇక బిందుకు తన ఇల్లే ఓ లోకం. బైట ఏం జరుగుతుందో పట్టించుకునే సమయం లేదు. దొరికినా పట్టించుకోదు కూడా! సాగర్‌లోని చిన్న చిన్న లోపాలను పట్టించుకునే ప్రయత్నంకూడా బిందు చేయలేదు. కారణం, తన పిల్లల భవిష్యత్తు ముందు మిగతావన్నీ ఆమెకు అనవసరం అనుకుంది. సాగర్ ముక్కోపి. తన భార్యను ఏమాత్రం ఆలోచించకుండా చిన్నబుచ్చే మనస్తత్వం. భార్యను గుప్పిట్లో పెట్టుకున్నాడు అనిపించుకోవాలనే తాపత్రయం. ఏదో ఒక కారణంచూపి బిందును నొప్పించడం ఆ ఇంట్లో సర్వ సాధారణం. ఆపై సిగరెట్లు వంటి వ్యసనాలు సరేసరి! ఇంటిఖర్చులకోసం లెక్కపెట్టినట్లు డబ్బివ్వడం, ప్రతిదానికీ ఆరాతీయడం. భార్యతో అచ్చటాముచ్చటా మాట్లాడాలన్న ఆలోచనే లేని మనిషి. పుట్టింటినుండి పెట్టుపోతలు లేవనే సాధింపులు. వీటన్నింటినీ బిందు పక్కకు నెట్టేసింది. తన పిల్లలు సుఖపడితే అంతే చాలనుకుంది. అందుకే అత్తమామలు దెప్పుళ్లు, ఆడబడుచుల ఆరళ్లూ నోరెత్తకుండా భరించింది.
కానీ, ఇప్పుడు భరించడం బిందు వల్లకావడంలేదు. కారణం, సాగర్ ఏర్పరచుకున్న వివాహేతర సంబంధం. ఇప్పుడు సాగర్ కంటికి ఎవరూ కనపడటంలేదు. ఇంటిని పట్టించుకోవడమే మానేశాడు. ఇల్లు ఎలా నడుస్తుందని ఆలోచించడంలేదు. పదిమందిలో నగుబాటు కానివ్వకుండా చేయాల్సిన బాధ్యత నీదేనంటూ బిందును బెదిరించాడు. తన వ్యవహారాలు పిల్లలకు తెలియకూడదంటూ వారిని హాస్టల్లో చేర్పించాడు. ఇలా ప్రవర్తించడం మంచిదికాదని హెచ్చరించినందుకు బిందుపైనే నిందలేయడం మొదలెట్టాడు. బిందునే వివాహేతర సంబంధం ఏర్పరచుకుని తనను నిందిస్తోందని చుట్టపక్కాల దగ్గర వాగడం ప్రారంభించాడు.
ఇది బిందు భరించలేకపోయింది. ఇన్నాళ్లూ, ఇన్నేళ్లూ ఓపిగ్గా భరిస్తూ వచ్చినందుకు ప్రతిఫలం ఈ రూపంలో దక్కిందా అని ఆక్రోశించింది. నిజమేదో నేను కాదు, 'ఐద్వా లీగల్‌సెల్'కే వెళ్లి తేల్చుకుందామంది. తిన్నగా 'ఐద్వా లీగల్‌సెల్'కు వచ్చి విషయం చెప్పింది. అకారణంగా తనపై నిందలువేసి తప్పించుకోజూస్తున్న భర్తకు మీరే బుద్ధి చెప్పాలంది. భర్తగా గౌరవించడమే తన తప్పా అని ప్రశ్నించింది. తన బిడ్డలను సాగర్ తనకు దూరంచేసిన వైనాన్ని వివరించింది. తన పిల్లలను హాస్టల్‌నుండి తీసుకొచ్చి తనవద్ద ఉండే ఏర్పాటుచేయమంది. తనకు, తన పిల్లలకూ న్యాయం చేయమంది. సభ్యులు బిందుకు ధైర్యంచెప్పారు. ఎలా చూసుకున్నా న్యాయం నీవైపే ఉంది కనుక ఏమాత్రం దిగులుపడొద్దన్నారు. సాగర్‌ను పిలిపించి మాట్లాడే పూచీ తమదన్నారు.
చెప్పినట్లుగానే సాగర్‌ను పిలిపించారు. వాస్తవాలు వివరించారు. 'భార్యగా అణకువగా మసలుకోవడమే బిందు చేసిన నేరమా? ఎన్నిరకాలుగా వేధించినా పసిపిల్లలపైనే ఆశలు పెట్టుకుని నువ్వు చేసిన అఘాయిత్యాలకు నోరుమెదపకపోవడమే ఆమె తప్పా? చేస్తున్న తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి పిల్లలను హాస్టల్లో చేర్పించడం, వారిని కన్నతల్లికి దూరంచేయడం ఏమన్నా పద్ధతిగా ఉందా? తాత్కాలిక ఆకర్షణలకు లోబడి అనుక్షణం నీ వెన్నంటి నిలిచిన భార్యకే గుండెగాయం చేసేంతగా హృదయం బండబారిందా?' అని సభ్యులంతా ఆవేశంగా సాగర్‌ను కడిగేశారు. మలినపడిన సాగర్ మనసు శుభ్రపడింది. తానేం చేస్తున్నానో, దానివల్ల జరిగే అనర్థాలేంటో అవగాహనకు వచ్చాయి. దాని ఫలితం వెంటనే కనిపించింది. పిల్లల్ని హాస్టల్‌నుండి తీసుకొచ్చాడు. అనవసర బంధాలకు తిలోదకాలు ఇచ్చాడు. బిందును ప్రేమగా చూసుకుంటున్నాడు. ఈ విషయం ప్రతి వారం లీగల్‌సెల్‌కు వస్తున్న బిందు స్వయంగా చెప్పింది. ఆమె ముఖంలోని చిరునవ్వును చూసి సభ్యులు కూడా సంతోషించారు. వారానికి వచ్చేవారు రానురాను పదిహేనురోజులకు వచ్చేవారు. తరువాత నెలకు వచ్చేవారు. వారిద్దరి అన్యోన్యత చూసిన సభ్యులు ఇక రానవసరం లేదని చెప్పారు.
No comments:
Post a Comment