'అనుమానం పెనుభూతం' అన్న నానుడి పలుమార్లు వినుంటాం. దానివల్ల కలిగే అనర్థాలు కూడా అనుభవించేవుంటాం. అయినా చటుక్కున ఎవరిపైనన్నా అనుమానం కలగడం,....................................పవన్ చదువులేనివాడు కాదు. చక్కగా చదువుకుని, అంతకన్నా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లిళ్ల పేరయ్య దృష్టిలో మాంచి 'గిట్టుబాటయ్యే' బేరం! కనుక, వచ్చే సంబంధాలకు లోటులేదు. అయినా అయ్యగారు చాలా ఆచితూచి వ్యవహరించారు. అన్నిటికన్నా లాభంచేకూరే వాసంతి సంబంధాన్ని ఓకేచేశాడు. అటు వాసంతి డిగ్రీ చదువుకుంది. లక్షణమైన అమ్మాయి. గుణవతి, రూపవతి కూడా! ఇంకా పై చదువులు చదవాలనే వాసంతి కోరికను పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లిచేసి అత్తవారింటికి పంపాలనే ఆత్రంముందు ఆమె కోరిక చిన్నబోయింది. మొత్తానికి ఓ శుభముహర్తాన పవన్ వాసంతిలు ఏకమయ్యారు.
మహానగరంలో కాపురం. కాపురానికి కావలసిన సకల సౌకర్యాలు వాసంతి తల్లిదండ్రులు దగ్గరుండి అమర్చారు. ఇద్దరూ సుఖంగా ఉండమని దీవించి వెళ్లిపోయారు. వాసంతికి రానురాను పవన్ ప్రవర్తన ఓపట్టాన అర్థమయ్యేదికాదు. వాసంతి చక్కగా ముస్తాబవకూడదు. గట్టిగా నవ్వకూడదు. బైటికి వెళ్లినప్పుడు తలెత్తి చుట్టూ చూడకూడదు. పరాయివాళ్లతో మాట్లాడకూడదు. ఇదంతా వాసంతికి ఇబ్బందిగా అనిపించేది. ఊపిరానడట్లు తోచేది. ఇదంతా పవన్‌కు తనపైగల ప్రేమగా సర్దిచెప్పుకుందామన్నా ఆమెవల్ల కాలేదు. చదువుకున్నా సంస్కారంలేని వాడితో ఎలా కాపురంచేయాలో ఆమెకు తోచలేదు.
ఇక తెగించి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని పవన్‌కు అడిగింది. దానికి అతని సమాధానం, 'ఈ నగరం పెద్ద మాయానగరం. ఇక్కడ రకరకాల మోసగాళ్లుంటారు. అందులోనూ నువ్వు చాలా అందగత్తెవు' ఈ సమాధానం వాసంతిని నొప్పించింది. 'ఎక్కడైనా ఇలాంటివాళ్లుంటారు. ఎవరెలా ఉంటే మనకేంటి, మనం సక్రమంగా ఉన్నప్పుడు మీకు నాపై నమ్మకముండాలిగానీ ఇవన్నీ మనం పట్టించుకోకూడదు.' అని నచ్చచెప్పింది. అయినా, పవన్ ప్రవర్తనలో మార్పులేదు. సరికదా, ఆఫీసుకెళ్లి మధ్యాహ్నం ఫోన్‌చేసి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడగడం, మధ్యలోనే ఆఫీసునుండి వచ్చి ఇల్లంతా వెతకడం. ఓరోజు ఎవరో అడ్రెస్ తెలీక అడిగితే చెప్పిన పాపానికి వాసంతి నరకం అనుభవించింది. చివరకు వాసంతి పుట్టింటికెళ్తే ఎవరిని కలవడానికి వెళ్లిందో అని పవన్ వాకాబుచేశాడు. అక్కడికి అర్థరాత్రి సమయంలో ఫోన్‌చేశాడు. వీటన్నింటితో వసంతి డస్సిపోయింది.
ఇక వాసంతి సహనం నశించింది. స్నేహితురాలిని తీసుకుని 'ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది. అతన్ని భరించడం నావల్లకాదంటూ వాసంతి కన్నీరుపెట్టింది. కాపురం కూలదోసుకోవడం తన ఉద్దేశ్యం కాదని, పవన్‌కు పట్టిన అనుమాన భూతం వదిలితే చాలంది. సభ్యులు పవన్‌ను పిలిచి మాట్లాడారు. 'ఏరికోరి చేసుకున్న భార్యను ఏడిపించడం, అంతకంతకూ దగ్గరవ్వాల్సిన ఆలుమగలు దూరమవడం మంచిదికాదు. ఒకరిపై మరొకరికి నమ్మకముండాలి. ఆ నమ్మకంతోనే వాసంతి తల్లిదండ్రులు నీకిచ్చి వివాహంచేశారు. ఆ నమ్మకంతోనే వాసంతి నీవెనుక ఈ మహానగరానికి వచ్చింది. ఇప్పుడుకూడా నువ్వు మారతావనే నమ్మకంతోనే, మారాలనే ఆశతోనే మా దగ్గరికి వచ్చింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో' అని చెప్పారు. పవన్‌లో అప్పటిదాకా గూడుకట్టుకున్న అహం కరగడం మొదలెట్టింది. వాసంతిలో తిరిగి ఆనందం చిగురుతొడిగింది. తరువాత వారం వారం వచ్చినపుడు పవన్ మారాడని వాసంతి చిరునవ్వుతో చెప్పింది. మరో కాపురం నిలబెట్టినందుకు సభ్యులకు సంతృప్తి మిగిలింది.
No comments:
Post a Comment