Sunday, March 22, 2015

మహిళ కాసేపు బాధపడతాం....

       
మన చుట్టూ చాలామందే ఒంటరి మహిళలు కనిపిస్తారు..ఒంటిచేత్తో పిల్లలను సాకుతున్న వారు తారసపడతారు. అటువంటి వారిని తలచుకుని  కాసేపు బాధపడతాం.. ఇంకాసేపు మధన పడతాం.. లేదంటే ఒక జాలిచూపుల బాణం విసిరేస్తాం.. ఒక్కసారి ఆ ఒంటరి మహిళల్ని  ప్రేమగా పలరించేందుకు ప్రయత్నిస్తే  వారు కన్నీటి జలపాతాలవుతారు. Read More http://www.10tv.in/ 

మీకు మేమున్నామనే భరోసా ఇస్తే జీవితేచ్ఛతో బతికేస్తారు. అటువంటి భరోసానే మానవి  ప్రతి మహిళకూ అందిస్తోంది, అందించాలనుకుంటోంది. అందులో భాగంగానే  ప్రతి వారం ఒక మహిళ యథార్థ గాథతో మీ ముందుకొస్తున్నాం. ఈ వారం భర్త సాహచర్యంలో బతుకు పండించుకోవాలనుకున్న స్వప్న వైవాహిక జీవితం ఎటువంటి విషాదాన్ని ఆమె జీవితంలో నింపిందో ఈ వారం తెలుసుకుందాం. 
    తన పేరు స్వప్న . అలాగని తను కలల లోకంలో విహరించేది కాదు. వాస్తవంలోనే బతుకుతోంది. ఎందుకంటే వాస్తవంలో బతకాలని తనకు నేర్పింది తన కుటుంబమే. ఊహ తెలిసిన రోజునుండే ఆమె అమ్మ విపరీతంగా కష్టపడేది. ఎన్నో రకాల పనులు చేసేది. తన చదువుకోసం.. తన భవిష్యత్ కోసం. అన్నిట్లో ముందుండే తనను చూసి అమ్మ ఎంత సంబరపడేదో, అంతే బాధ కూడా పడేది. తన పట్ల బాధ్యత లేకుండా తిరిగే నాన్నను చూసి భయపడేది. ఎదిగొస్తున్న తన్ను చూసి, తన పెళ్లి బాధ్యత ఎవరు తీసుకుంటారని అమ్మ ఆందోళన పడేది. తన భవిష్యత్ జీవితం ఎలా ఉంటుందోనని దిగులుపడేది. ఆ ఆందోళన నుండే తన పెళ్లి చేసేయాలని తొందరపడింది. 17ఏళ్ల ప్రాయంలోనే  తనను పెళ్లి పీటలకెక్కించింది. అమ్మకోసం తలదించుకున్న ఆమె ఆ తర్వాత కాలమంతా తలవంచే బతికింది. 
స్వప్న వైవాహిక జీవితం..
    తనకూ , తన భర్త ఆకాష్ కి కచ్చితంగా పదేళ్ల తేడా. భర్త ఆలోచనలకి, తన ఆలోచనలకీ ఎంతో తేడా.. అయినా భర్త ఏం చెప్పినా వినేది. అది తన మనసుకి కష్టమైనా భరించేది. తన పెళ్లి నాటికి ఆమె భర్త హోటల్ మేనేజ్ మెంట్  కోర్స్ పూర్తిచేసి, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆ హోదా చూసే వయసు తేడా అయినా తనకిచ్చి పెళ్లి చేసింది అమ్మ. తన పెళ్లి తర్వాత కొంతకాలమే అతను ఉద్యోగంలో ఉన్నాడు. వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేసాడు. ఇదేంటని అడిగితే వేరే కంపెనీలో ఉద్యోగం వెతుక్కుంటాలే అని దాటవేసేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు  పెళ్లి తర్వాత దాదాపు ఏ  పనీ చేయకుండానే  ఏడేళ్ల పాటు గడిపేసాడు. ఆ తర్వాత చిన్నా చితక ఉద్యోగాలు చేసినా, ఎక్కడా కుదురుగా లేడు. దాంతో పెళ్లయిన వెంటనే స్వప్న ఉద్యోగంలో చేరిపోయింది. ఆ రోజు నుండీ ఇంటి బాధ్యత తానే తీసుకుంది. కష్టమైనా, నష్టమైనా భరించాలనుకుంది. మనసును కుదుట పరుచుకుంది. 
భర్తలో గమనించిన ఫోబియా..
    బాబు పుట్టాకైనా తన భర్తలో మార్పొస్తుందన్న స్వప్న ఆశ అడియాసే అయింది. కొంతలో కొంత ఊరట ఏంటంటే, తాను ఉద్యోగానికి వెళ్తే తన భర్త బాబు బాధ్యత చూసుకునేవాడు. సరే, ఇది కూడా తనకు కొంత వెసులుబాటులే అనుకుని తన్ను తాను కుదుటపరుచుకుంది. కానీ, నెమ్మది నెమ్మదిగా అతనిలో అనేక మార్పులు. రోజుల తరబడి ఇంట్లో కూర్చోవడం వల్లో, లేక ఖాళీ బుర్రలో  పనికిరాని విషయాలు వచ్చిచేరడం వల్లో తన మానసిక స్థితిలో అనేక మార్పులు. చివరికి బైటికెళ్లి చిన్నచిన్నపనులు చేసుకురావడానికి కూడా భయపడిపోయే స్థితికి చేరుకున్నాడు. ఎందుకు అలా భయపడిపోయేవాడో కొంతకాలం వరకు ఆమెకు అర్థమయ్యేది కాదు.. ''ఎందుకలా నీలో నువ్వే ముడుచుకుపోతావ్.. బైటికెళ్లడానికి అంత భయమేంటి'' అంటే ''యాక్సిడెంట్ జరుగుతుందని, అలా జరిగితే తాను చచ్చిపోతా''నంటాడు.  సో, ఆకాష్ కి ఒకలాంటి ఫోబియా పట్టుకుంది.. ఎందుకలా మాట్లాడుతున్నావని రెట్టించి అడిగితే, తన స్నేహితుడెవరో అలాగే చచ్చిపోయాడని వాదిస్తాడు.. అతనికలా జరిగిందని నీక్కూడా అలాగే ఎందుకు జరుగుతుందనే ప్రశ్నిస్తే మౌనమై పోతాడు.. ఇలా కాదు, నీ ఆలోచన తప్పు, నీకు కౌన్సిలింగ్ అవసరమంటే, అదిగో నాకు అనారోగ్యమంటావా? మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తావా? అని ఎదురు దాడి చేయడం.. ఏమీ చేయలేక, ఈ సమస్యను ఎవరికీ చెప్పలేక కుమిలిపోయేది. అందరూ తననే తప్పుపడ్తారని భయపడేది. ధైర్యం చేసి పెద్దవాళ్లకు చెప్తే  పోనీలే కొంతకాలానికి వాడే మారతాడులే అని సర్దిచెప్పారు.. దాంతో ఏమీ చేయలేక సమస్యను అలాగే వదిలేసింది. తానే మారతాడులే అని తన్ను తాను సమాధాన పరుచుకుంది. కానీ, పరిస్థితి మరింత విషమించడం తప్పితే, ఆశించిన మార్పేమీ రాలేదు.. వస్తుందన్న ఆశ కూడా తనకు కనిపించలేదు.. 
వ్యసనాలకు బానిసైన ఆకాష్..
    రోజుల తరబడి, నెలల తరబడి ఇంట్లోనే ఉండిపోయి, ఆకాష్ విపరీతంగా ప్రవర్తించేవాడు.. ఈ క్రమంలోనే  మద్యానికి బానిసయ్యాడు.  ఏ పనీ లేకుండా, గంటలతరబడి ఇంట్లోనే ఉండిపోయి, ఏమాలోచిస్తున్నాడో తెలిసేది కాదు. కొద్దిరోజుల్లోనే షుగర్, బి.పి కూడా వచ్చాయి. దాంతో మందులు, హాస్పిటల్స్ అతని జీవితంలో భాగమయ్యాయి. దానికి తోడు అనేకానేక సమస్యలు జతచేరాయి..డాక్టర్లు  తాగొద్దని సీరియస్ గా చెప్పినా, మానడానికి ఆకాష్ ప్రయత్నించలేదు. మానేయమని స్వప్న ఎంత ప్రేమగా చెప్పినా  అర్థం చేసుకునేవాడు కాదు. తన లోకంలో తానుండే వాడు. చూస్తుండగానే పెళ్లై పదేళ్లు గడిచిపోయాయి. జీవితంలో ఇంకా ఏ మార్పు రాదా? ఏ మార్పు జరగదా ? అన్న సందేహం వెంటాడుతా ఉండేది. ఈ మనిషి మారితే బాగుండు. ఏ పనీ చేయకపోయినా సరే, కనీసం తాగడం మానేస్తే బాగుండని పగలు, రాత్రి మధనపడుతూ ఉండేది. 
ఆకాష్ కు హార్ట్ స్ట్రోక్...
    స్వప్న తన ఆలోచనలో, ఆవేదనలో ఉండగానే, ఒకరాత్రి  ఆకాష్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ లో అడ్మిట్ చేసే సమయానికి ఆకాష్ మద్యం మత్తులో ఉన్నాడు. డాక్టర్స్ అదే రిపోర్ట్ లో రాసారు. వారం రోజుల పోరాటం తర్వాత కన్నుమూసాడు. ముఫ్ఫై ఏడేళ్లకే ప్రాణాలు కోల్పోయాడు. స్వప్నను ఒంటరి చేసాడు. ఎంత ఏడ్చినా, ఎవరిని నిందించినా తిరిగిరాడుగా? ఏడుపే తనకు మిగిలింది. దుఃఖమే తనకు తోడైంది..ఒంటరితనమే తనకు దిక్కైంది. 
స్వప్నపై హత్యానేరం..
    ఆకాష్ తన్ను వదిలేసి వెళ్లి, అప్పుడే నెల రోజులైంది. ఏం చేయాలో, భవిష్యత్ ఎలా ఉంటుందోననే భయం తన్ను వెంటాడుతోంది. ఒంటిచేత్తో బిడ్డను ఎలా సాకాలా? అని ఎడతెగని ఆలోచనల్లో ఉండగానే పిడుగులాంటి వార్త.  స్వప్న తన భర్తను తానే చంపిందని అత్తింటివారి వారు కొత్తగా తన మీద  అపవాదు మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. అసలు తన భర్తను తనెందుకు చంపుకుంటుంది?  పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు  తనను ఉక్కిరిబిక్కిరి చేసింది.  తాను ఏ తప్పూ చేయలేదు .. అలాంటప్పుడు తానెందుకు భయపడాలని తన్ను తాను సమాధానపరుచుకుంది. అయినా ఊరుకోకుండా, అయినా ఆమె మానాన ఆమెను  వదిలేయకుండా, ఆమె మామగారు ఫోన్ లో  తన అంతుచూస్తానని బెదిరింపులు. పిల్లాడిని ఇచ్చేయమని దబాయింపులు. వణికిపోయింది. ఎవరు ఓదార్చినా, ఎంత ధైర్యం చెప్పినా వణికిపోయేది.  
ధైర్యంగా అడుగు ముందుకేసిన స్వప్న...
    ఆకాష్ చనిపోయిన రోజు నుండీ  అనేక సార్లు పోలీసుల ఎంక్వైరీలు. ఈ ఎంక్వైరీలతో విసిగిపోయినా, ఓపికగా ఉండేది. అలా దాదాపు ఆరునెల్ల పాటు ఈ ఎంక్వైరీలతో సరిపోయింది.. అసలెందుకు తన మీద ఇలాంటి తప్పుడు కేసు బనాయించారో తెలుసుకోవాలనుకుంది. అవసరమైతే న్యాయపోరాటం చేయాలని నిశ్చయించుకుంది..  భయపడుతూ బతకడం మొదలెడితే జీవితాంతం భయపడుతూనే బతకాలి.. అందుకే, ధైర్యంగా న్యాయపోరాటానికి సిద్ధపడింది. చివరికి ఆ పోరాటంలో తానే నెగ్గింది. తన మీద మెట్టినింటివారు చేసిన అభియోగాలకు ఏ ఆధారాలు చూపలేకపోయారు.. అలా మొత్తానికి ఊపిరి పీల్చుకుంది.. 
డిప్రెషన్స్ నుండి రిలీఫ్...
    ఇప్పుడిప్పుడే, అన్ని రకాల టెన్షన్స్ నుండి ఆమె బైటపడుతోంది. తన భర్త పేరుతో వచ్చిన ఇన్సూరెన్స్ సొమ్ములో తనకు గానీ, తన బిడ్డకు గానీ చిల్లిగవ్వ ఇవ్వలేదు.. ఆస్తిలో వాటా ఇవ్వలేదు..  పిల్లాడి భవిష్యత్ కోసం కూడా ఆర్థిక సాయం చేయలేదు..  తిరిగి ఉద్యోగంలో చేరింది.. పిల్లాడిని చదివించుకుంటోంది. 
ఆలోచనలు రేపిన రెండోపెళ్ళి..
    వయసు మించి పోలేదుగా రెండో  పెళ్లి చేసుకోమని కుటుంబసభ్యుల నుండి  ఒత్తిడి. నిజమే  ముఫ్పై ఏళ్లు కూడా నిండకుండానే, జీవితంలో అనేక అనుభవాలు, వెన్నంటే  విషాదాలు, మరిచిపోలేని  జ్నాపకాలు, ఏం చేయాలో తనకు పాలుపోవడం లేదు. రెండో పెళ్లికి మనసు అంగీకరించడం లేదు. అలాగని జీవితాంతం ఒంటరిగా  ఉండిపోవడం సాధ్యమేనా అంటే తేల్చుకోలేక పోతోంది.. ఒకవేళ సరేనని, రెండో పెళ్లికి సిద్ధపడితే, తన జీవితంలోకి వచ్చే మనిషి తనను అన్ని రకాలుగా అర్థం చేసుకుంటాడా? అనే సందేహం వెంటాడుతోంది.. అలాగని  తన సమస్యకు పరిష్కారాన్ని కాలానికి కూడా వదిలేయలేకపోతోంది... ఇదీ ఇప్పుడు తన పరిస్థితి..   చూద్దాం.. కాలగమనం స్వప్న సమస్యకు ఏ పరిష్కార మార్గం చూపిస్తుందో. 

No comments:

Post a Comment